పోలీసుల‌పై క‌త్తితో దాడి చేసిన యువ‌కుడు

A man attacked a police officer with a knife:పోలీసుల‌పైనే క‌త్తితో దాడి చేసిన అబ్దుల్ క‌లీమ్ అనే వ్య‌క్తి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పోలీసులు గాయ‌ప‌డ్డారు. ఈ దాడి ఏకంగా పోలీస్‌స్టేష‌న్‌లోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే పోలీసుల‌పై దాడిచేసి పారిపోయాడు ఒక వ్య‌క్తి. నిర్మ‌ల్ జిల్లాలో క‌ల‌క‌లం సృష్టించిన ఘ‌ట‌న వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌కు రాత్రి ప‌ది గంట‌ల ప్రాంతంలో అబ్దుల్ కలీమ్ అనే వ్య‌క్తి వ‌చ్చాడు. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ అడ్డుకున్నాడు. ఏమైంది అని అడిగుతుండ‌గా, వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పై భాగంలో పొడిచాడు. అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా, బలంగా తోసేయడంతో అతని చేతులకు సైతం గాయాలయ్యాయి.

వీరి అరుపులకు మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుక క్వార్టర్లలోని పోలీసులు రావడంతో నిందితుడు క‌లీమ్ అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. గాయపడిన నారాయణ, గిరిధారిలకు కుభీర్‌లో ప్రాథమిక చికిత్స అందించి, భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణను మెరుగైన చికిత్స కోసం నిజాంబాద్ ఆసుపత్రికి తరలించారు. నిందితున్ని పోలీసులు తెల్ల‌వారుఝామున అదుపులోకి తీసుకున్నారు.

You might also like