యంత్రాల వినియోగం పెరగాలి
యంత్ర వినియోగం పెరిగితేనే ఉత్పత్తి లక్ష్యాలు సాధ్యం - కంపెనీ యంత్రాల వినియోగాన్ని 18 గంటలకు పెంచాలి - కంపెనీ షావెల్స్ తో రోజుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాలి - సీహెచ్‌పీలు, కంపెనీ యంత్రాల పనితీరుపై సమీక్షలో డైరెక్టర్లు - బొగ్గు రవాణాకు లారీల కొరత లేకుండా యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలంటే కంపెనీ వ్యాప్తంగా యంత్రాల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగరేణి డైరెక్టర్లు కోరారు. ముఖ్యంగా కంపెనీ యంత్రాల పని గంటలను 14 గంటల నుంచి 18 గంటలకు పెంచాలన్నారు. శుక్రవారం చంద్రశేఖర్ (ఆపరేషన్స్), బలరామ్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, ఫైనాన్స్, పర్సనల్), సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం) ఏరియా జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్లు, కంపెనీ యంత్రాల పనితీరుపై అడ్వైజర్ (మైనింగ్) ప్రసాద్, ఈడీ (కోల్ మూమెంట్) అల్విన్, జీఎం (కో ఆర్డినేషన్,మార్కెటింగ్) సూర్యనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు. కంపెనీ షావెల్స్ పనిచేస్తున్న ఆర్జీ ఓసీ-1, ఆర్జీ ఓసీ-2, ఆర్జీ ఓసీ-3, జీకే ఓసీ, పీకే ఓసీలో కంపెనీ షావెల్స్‌తో పాటు ఇతర యంత్రాలను రోజుకు 14 గంటలకు మించి వినియోగించడం లేదన్నారు. యంత్ర వినియోగాన్ని 18 గంటలకు పెంచాలన్నారు. రక్షణ తో కూడిన ఉత్పత్తి సాధించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కంపెనీ యంత్రాల ద్వారా రోజుకు 2 లక్షల క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా ఓవర్‌బర్డెన్ తొలగించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. బ్రేక్ డౌన్లను తగ్గించుకోవాలని, సకాలంలో మెయింటెనెన్స్ చేయడం, యంత్రాల విడి భాగాలను స్టోర్స్‌లో అందుబాటులో ఉంచుకునేలా చూడాలన్నారు. కంపెనీ షావెల్స్ వినియోగం పెరిగితే ఉత్పత్తి లక్ష్యాలను సులువుగా చేరుకోగలుగుతామన్నారు. గతేడాదితో పోల్చితే సీహెచ్పీల ద్వారా బొగ్గు రవాణాలో 60 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు పెరగనున్నందున సీహెచ్పీల సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లారీ ట్రాన్స్ పోర్టర్లు ప్రతినిధులతో సమావేశం
గనుల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గు నిరాటంకంగా సరఫరా చేసేందుకు వీలుగా లారీలను గనుల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని లారీ ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలను కోరారు. ఉత్పత్తికి కీలకమైన చివరి నాలుగు నెలల్లో రవాణాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. డీజీల్ ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలను చెల్లించే ఫార్ములా మార్చినట్లు, లారీ ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాల సమస్యలను పరిష్కరించినట్లు డైరెక్టర్లు వివరించారు. ఈ నేపథ్యంలో రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. సింగరేణిలో బొగ్గు రవాణాలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా లారీ ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులు సింగరేణి యాజమాన్యానికి హామీ ఇచ్చారు. సమావేశంలో జీఎం(సీపీపీ) నాగభూషణ్ రెడ్డి, జి.ఎం (పి.పి.) సత్తయ్య, జి.ఎం(సి.హెచ్.పి) స్వామినాయుడు, జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్పోరేట్ ఏరియా జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.