మావోయిస్టు అగ్ర‌నేత మ‌రో లేఖ..

Maoist Party:మావోయిస్టు పార్టీ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని క్యాడర్‌కు పిలుపునిస్తూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 23 పేజీల‌తో కూడిన ఆ లేఖ ఆయ‌న త‌న పేరుతో విడుద‌ల చేశారు. పార్టీ ఇప్పటివరకు అనుసరించిన పంథా పూర్తిగా తప్పని, దీనివల్ల ఉద్యమం తీవ్రంగా నష్టపోయిందని అంగీకరించారు. ఉద్యమాన్ని ఓటమి పాలుకాకుండా కాపాడలేకపోయినందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం ఒక టీకా లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీని కాపాడుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లోనే ఇప్పుడు నేను, అంతకు ముందు జీఎస్‌ శాంతి చర్చల ప్రక్రియకు పూనుకున్నామని వెల్ల‌డించారు. విషయాన్ని అర్థం చేసుకోవాలని క్యాడ‌ర్‌కు మల్లోజుల వేణుగోపాల్ సూచించారు. పార్టీ వెనుకబాటుతనం నుంచి బయటపడేందుకు కగార్‌ను ఒక సందర్భంగా తీసుకోవాలన్నారు. అనేక రాష్ట్రాల్లో పార్టీ పెద్ద ఎత్తున నష్టపోతోంది. అందుకు దారి తీసిన కారణాలను నేను మీ ముందు ఉంచుతున్నానన్నారు. వీటిపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే సముచితమైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

శత్రు వర్గాలు ముహుర్తాలు ప్రకటించి మన పార్టీని అంతం చేస్తామంటున్నారని వారికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది మనం అనుసరించిన తప్పుడు విధానాలేనన్నారు. అర్చన్ పాలసీ పేపర్ రాసుకున్నా, దానిని అమలు చేయలేని పరిస్థితి మనదన్నారు. తప్పులను సవరించుకోవాలని కింది స్థాయి నుంచి అభిప్రాయాలు వస్తున్నా వాటిని పార్టీ కేంద్ర కమిటీ లెక్క చేయడం లేదని విమర్శించారు. దండకారణ్యంలో ఏడాదికి ఒకటి రెండు పెద్ద సైనిక చర్యలు చేస్తూ మన బలాన్ని అతిగా అంచనా వేసుకున్నామే తప్ప మన బలహీనతలను అర్థం చేసుకోకపోయామన్నారు.

లోటుపాట్లు ఎవరు చెబితే వారినే ప్రజా యుద్ధం అర్ధం కాని వారిగా సెంట్రల్ కమిటీ ఎద్దేవా చేస్తూ వస్తోందని, వాటి ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తూ చివరకు ఓటమి పాలవుతున్నామని వేణుగోపాల్ అన్నారు. ఇంత జరిగినా కేంద్ర‌క‌మిటీ ఈ విష‌యాన్ని సీరియస్ గా గుర్తించడమే లేదన్నారు. ఇకనైనా అతివాద ఒంటెద్దు పోకడలు పదిలి ప్రపంచ విప్లవోద్యమాల చరిత్రలను అధ్యయనం చేయాలని సూచించారు. పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలి. త్యాగాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు.. వర్తమాన ఫాసిస్టు విధానాలతో లక్ష్యం నెరవేర్చలేమన్నారు.

ఆయుధాలు వీడాలనే నిర్ణయంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జీవించి ఉన్నప్పుడే ఈ అంశంపై చర్చ జరిగిందని గుర్తుచేశారు. ఈ విషయంలో పార్టీ అధికార ప్రతినిధి జగన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఫాసిస్టు పరిస్థితుల్లో సాయుధ పోరాటం ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని స్పష్టం చేశారు. అనవసర త్యాగాలకు ఇకనైనా ముగింపు పలికి, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని క్యాడర్‌కు ఆయన సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like