బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా
High Court: బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రెండు వర్గాల వాదనలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఈ రోజుల అటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగాయి. రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామని అటార్నీ జనరల్ కోరడంతో సరేనని కోర్టు అంగీకరించింది. గురువారం మధ్యాహ్నం రెండున్నరకు వాదనలు వినిపిస్తామని వెల్లడించింది. గురువారం అటార్నీ జనరల్, ఎన్నికల సంఘం తరఫున వాదనలు చెప్పాల్సి ఉంటుంది అందుకే రేపు మరిన్ని వాదనలు వింటామని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ వెల్లడించింది.
పిటిషన్ల తరఫున వాదనలు వినివిస్తూ లాయర్లు ట్రిపుల్‌టెస్ట్ పైనే వాదనలు కొనసాగాయి. ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ప్రస్తావించారు. ట్రిపుల్ టెస్టు లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సందర్భంగా సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను లాయర్ బుచ్చిబాబు గుర్తు చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ లాయర్ ప్రస్తావించారు.
రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఎన్నికలకు సంబంధించి కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారని, నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదన్న లాయర్లు వెల్లడించారు. తాము నాలుగు అంశాల ఆధారంగా జీవో 9 ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. వన్‌మ్యాన్ కమిషన్ నివేదిక బయటపెట్టలేదని అడ్వకేట్ వివేక్‌రెడ్డి స్పష్టం చేశారు. ట్రిపుల్ టెస్టు లేకుండానే రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని చెప్పారు. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాసైందని చీఫ్ జస్టిస్ ప్రశ్నించడంతో ఆగస్ట్ 31 రెండు సభల్లో పాసైందని లాయర్ వెల్లడించారు.
రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో సుప్రీం కోర్టు ఆదేశం తప్పితే రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పిటిషనర్ల తరఫున వాదనలు ముగిసిన తర్వాత ప్రభుత్వం తరఫున లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీం కోర్టు ఆదేశం మాత్రమే ఉందని, రాజ్యాంగంలో ఈ పరిమితికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదని తెలిపారు.
ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. బిల్లు గవర్నర్‌కు పంపి ఆరునెలలు అవుతోందని, బిల్లు ఆయన ఆమోదించలేదు.. తిరస్కరించలేదన్నారు. ఆయన ఆమోదించాలి లేకపోతే రాష్ట్రపతికి పంపించాలని తెలిపారు. 2018లో పంచాయతీ రాజ్ చట్టం పాసైన సందర్భంలో ఈ కసరత్తు జరగలేదన్నారు. 2019లో ఈడబ్ల్యుఎస్ 10 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయన్నారు. ఫలితంగా రిజర్వేషన్లు 50 శాతం దాటి 60 వరకు చేరాయని స్పష్టం చేశారు. జీవోపై స్టే ఇవ్వాలనడం సరికాదని అభిషేక్ మను సింఘ్వీ అభ్యంతరం తెలిపారు.
ప్రభుత్వం చేసిన సర్వేలో 97శాతం ఇంటింటి సర్వే జరిగిందన్నారు. లక్ష మంది ఎన్యుమరేటర్లతో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. శాస్త్రీయ బద్దంగా సర్వే జరిగాకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు చేశారని అన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఈ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ జరిగిందని తెలిపారు. సర్వేలో 56 శాతం బీసీలు ఉన్నారని తేలిందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఈ సమయంలో స్టే ఇవ్వాలని కోరడం సమంజసం కాదన్నారు. పూర్తి వాదనలు విన్నాకే నిర్ణయం వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు అభిషేక్ మను సింఘ్వీ..
ఈ నేపథ్యంలో ఏజీ కోర్టుకు మరిన్ని వాదనలు వినిపిస్తామని చెప్పడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.