లేకపోతే చర్యలు తప్పవు
రోజుకు 14.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాలి - అప్పుడే నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు చేరుకుంటాం - టెండర్ లో చెప్పినన్ని యంత్రాలను సమకూర్చుకోవాలి - ఓబీ కాంట్రాక్టర్లలతో సమీక్ష లో డైరెక్టర్ల స్పష్టీకరణ
హైదరాబాద్ – సింగరేణి ఉపరితల గనుల నుంచి డిసెంబరులో ప్రతి రోజు 14.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని సింగరేణి డైరెక్టర్లు కోరారు. అప్పుడే ఉత్పత్తి లక్ష్యాలు చేరుకుంటామని తెలిపారు. దీని కోసం ఓబీ కాంట్రాక్టర్లు, ఏరియా జీఎంలు సమన్వయంతో పనిచేయాలన్నారు. డైరెక్టర్లు చంద్రశేఖర్ (ఆపరేషన్స్),బలరామ్(ప్రాజెక్ట్స్అండ్ప్లానింగ్, ఫైనాన్స్,పర్సనల్), సత్యనారాయణరావు (ఈఅండ్ఎం) సూచించారు. శనివారం సింగరేణి భవన్లో జీఎం (కోఆర్డినేషన్,మార్కెటింగ్) సూర్యనారాయణతో కలసి ఓబీ కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో డైరెక్టర్లు మాట్లాడుతూ టెండర్లలో పేర్కొన్నట్లుగా యంత్రాలను సమకూర్చుకోవాలన్నారు. లేకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఓబీ వెలికితీతకు అవసరమైన ఎక్స్‌ప్లోజివ్స్ కొరత రాకుండా చూస్తున్నామనానరు. ఇతర సమస్యలు లేకుండా చూస్తున్నామని చెప్పారు. కచ్చితంగా నిర్దేశిత లక్ష్యం మేరకు ఓబీ వెలికి తీయాల్సిందేనన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలలు ఉత్పత్తికి అతికీలకమని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. నూతనంగా కాంట్రాక్టులు చేపట్టిన సంస్థలు మానవ వనరుల కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఓబీ కాంట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనైనా రోజుకు 12.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని స్పష్టం చేశారు. సింగరేణి డిపార్ట్‌మెంటల్ యంత్రాలతో రోజుకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని డైరెక్టర్లు నిర్దేశించారు. సమావేశంలో జీఎం(సీపీపీ) కె.నాగభూషణ్ రెడ్డి, జీఎం(సీఎంసీ) రామచందర్, ఎస్వో టూ డైరెక్టర్లు దేవికుమార్, రవి ప్రసాద్, ఆయా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.