నా చావుకు కాంగ్రెస్ నేతలే కారణం..
వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు యేట మధూకర్ (45) నీల్వాయి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమంటూ మధూకర్ రాసిన సూసైడ్ నోట్ లభించింది. కాంగ్రెస్ నేత రుద్రభట్ల సంతోష్, గాలిమధు, చింతకింద కమల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నాడు. వేమనపల్లి మండలంలో కుటిల రాజకీయాలు ఉన్నాయని, తన క్యారెక్టర్ అలాంటిది కాదంటూ స్పష్టం చేశాడు. గతంలో దుర్గం శివరాం, ఇప్పుడు యేట మధూకర్ ఇలా బలికావాల్సిందేనా..? అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పండంటూ సూసైడ్ నోట్ రాశాడు.
కాంగ్రెస్ నేతలు, ఎస్ఐ వల్లనే..
కాంగ్రెస్ నేతలు అక్రమ కేసులు బనాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురై యేట మధూకర్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి ఆత్మహత్యకు పురిగొల్పిన బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు సహకరించి అక్రమ కేసులు నమోదు చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులను అరెస్టు చేసేంతవరకు మృతదేహాన్ని పోలీసులు ముట్టకూడదని వేమనపల్లి, చెన్నూర్ ప్రధాన రహదారిపై మృతుడి కుటుంబసభ్యులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు శవం చెట్టుకే ఉండటంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.