ముస్లిం మత పెద్దలు ముందుకు రావాలి
వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలి - జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ
మంచిర్యాల – ప్రస్తుతం ఒమ్రికాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వయస్సు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ అన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. శనివారం జిల్లాలోని లక్ష్సెట్టిపేట మున్సిపల్ పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు 95 శాతం పూర్తి అయ్యిందని, రెండో డోసు టీకా ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి, రెండు డోసులు పూర్తి స్థాయిలో తీసుకున్నప్పుడే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొంది వైరస్ ఎదుర్కొనేందుకు దోహదపడుతుందన్నారు. మొదటి డోసు తీసుకుని రెండవ విడత తీసుఉనే సమయం వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వాక్సిన్ వేసుకోవాలన్నారు. రెండు డోసులు తీసుకున్న వారిపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాలు, అపోహలకు గురి కాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ముస్లిం నివాస ప్రాంతాల్లో వాక్సినేషన్ శాతం తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, వెంకట్రావు పేట వైద్యాధికారి సతీష్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.