48 గంటలు టైమిస్తున్నా…
Union Minister of State for Home Affairs Bandi Sanjay:48 గంటలు టైమిస్తున్నా… మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల్సిందే.. వేధించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాల్సిందే… లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఆయన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో ఆత్మహత్య చేసుకున్న వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధూకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ అరాచకాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. నక్సలైట్ల తూటాలకే భయపడని తెగింపు బీజేపీ కార్యకర్తలదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అరాచకాలను ఎదిరిస్తామని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. వారికి వత్తాసు పలికే పోలీసులకు చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరించారు. గూండాగిరి చేసే నాయకులను యూపీ తరహాలో శిక్షిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలకు వ్యతిరేఖంగా పోరాటం చేశామని, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మేం పోరాటం చేస్తే ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు వేశారని తెలిపారు. రౌడీషీట్లు ఓపెన్ చేసినా బిజెపి కార్యకర్తలు ఎక్కడా భయపడేలేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువ దౌర్జన్యాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దమనకాండ చేయడం సిగ్గు చేటన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా కుటుంబ దుస్థితి, కాంగ్రెస్ నేతలు, పోలీసుల అరాచకాలను వివరిస్తూ మధుకర్ కుటుంబ సభ్యులు రోదించారు. మధుకర్ కుటంబ పరిస్థితిని చూసి బండి సంజయ్ తీవ్రంగా చలించి పోయారు. మధుకర్ కుటుంబాన్ని అన్ని విధాలా బీజేపీ ఆదుకుంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారాయన..