మంత్రి ఇలాకాలో రైతు ఆత్మహత్య…
చెన్నూర్ పట్టణంలోని మహంకాళివాడకు చెందిన గడల మొండి (60) అనే రైతు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక క్రిమి సంహారక మందు తాగి పాలవాగు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొన్నేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పొలాలు తరచూ ముంపుకు గురై పంటలు వరుసగా నష్టపోవడంతో జీవనాధారం పూర్తిగా కోల్పోయాడని తెలిపారు. పంటలు నష్టపోవడంతో అప్పులు పెరిగిపోవడం… ఆదాయం లేక బాధ్యతలు మోసే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మానసిక వేదనతో మొండి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న చెన్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ “కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపుతో తమ పంటలు నాశమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల నష్టం ఓ వైపు… పరిహారం లేకుండా రైతులు చనిపోవడం మరో వైపు… ఇలా ఎన్ని ప్రాణాలు పోయాక ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
మంత్రి వివేక్ ఎన్నికల సమయంలో పంటలు ముంపు బారిన పడకుండా కరకట్టలు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. దాదాపు రెండేళ్లైనా దాని గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెబుతున్నరాఉ. ఇప్పటికైనా ముంపు బాధిత రైతులకు తక్షణ ఆర్థిక సహాయం, పునరావాస చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.