నీల్వాయికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
BJP state president Ramchandra Rao:భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయికి రానున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఏట మధూకర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాని కలిసి ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని, ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందిస్తారు.
వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ (47) ఐదు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్ రాసి ఉరివేసుకున్నాడు. ‘రుద్రభట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల రాజకీయంగా ఎదుర్కొనలేక నాపై తప్పుడు కేసులు పెట్టించి నా పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసి నా చావుకు కారణమయ్యారు. వీళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని రాసిన సూసైడ్ నోట్ మధుకర్ జేబులో లభించింది. దీంతో రాజకీయంగా ఇది దుమారం రేపింది.
ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ నీల్వాయి వచ్చారు. 48 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే బీజేపీ తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.