పార్టీ బీ ఫామ్.. రూ. 40 లక్షల చెక్కు..
రేపు మాగంటి సునీత నామినేషన్ దాఖలు
Jubilee Hills By-Election:జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకి పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం బీ-ఫామ్ అందించారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ. 40 లక్షల చెక్కు సైతం అందించారు. ఈ సందర్భంగా దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు కుమారుడు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేపు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కేవలం నలుగురు నేతలు వెళ్లి నామినేషన్ వేసేలా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసినట్లు సమాచారం.
మాగంటి సునీత, అక్షరపై కేసు నమోదు
దివంగత జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదయింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే నెపంతో సునీతను ఏ1గా, అక్షరను ఏ2గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరిలో శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల క్యాంపెయినింగ్‌లో భాగంగా వీరు నిర్వహించిన ప్రచారంపై కేసు నమోదయింది. వెంకటగిరిలో నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని కేసు నమోదు చేశారు.