నిందితుల‌కు ఎమ్మెల్యే వినోద్ ఆశ్ర‌యం

-ఇన్ని రోజులైనా పోలీసులు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం విచార‌క‌రం
-ఇది ఖ‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల హ‌త్యే
-నిందితులు ఎమ్మెల్యే ఫాంహౌస్‌లోనే ఉన్న‌ట్లు స‌మాచారం
-మీకు ఓట్లేసి గెలిపించింది మ‌నుషుల‌ను చంప‌మ‌ని కాదు
-ఏట మధుకర్ ఆత్మహత్యపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్ర‌హం

Former MLA Durgam Chinnaiah:వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ గారి ఆత్మహత్యకు సంబంధించి ఇంతకాలం గడిచినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి బండి సంజయ్ 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విచారకరమ‌న్నారు. ఆల‌స్యం అయితే ఈ కేసులో ఉన్న దోషులు త‌ప్పించుకునే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఈ కేసు మొత్తం నీరుగారే ప్ర‌మాదం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

మధుకర్ మరణం కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల హ‌త్యేన‌ని దుర్గం చిన్న‌య్య స్ప‌ష్టం చేశారు. వెనుక ఉన్న రాజకీయ కక్షలు వెలుగులోకి తేవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుల‌కు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆశ్రయమిచ్చి వారిని కాపాడుతున్నారని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. ఎమ్మెల్యే ఫాంహౌస్‌లోనే ఉన్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌న్నారు. ఎమ్మెల్యే వినోద్ హైద‌రాబాద్లో ఉండ‌కుండా స్థానికంగా ఉండి ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూడాల‌న్నారు.

వేమ‌న‌ప‌ల్లి మండ‌లం ఒక్క‌టే కాకుండా, క‌న్నెప‌ల్లి, నెన్న‌లలో కూడా ఎమ్మెల్యే ముఖ్య అనుచ‌రులు వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రామ‌గుండం క‌మిష‌న‌ర్‌, డీసీపీ, పోలీసు అధికారుల దృష్టికి ప‌లు అంశాలు తీసుకుపోయార‌ని అన్నారు. పోలీసు అధికారులు సైతం కాంగ్రెస్ నాయ‌కుల మాట‌లు విని కేసులు పెడుతున్నార‌ని వారికి చెప్పామ‌న్నారు. మీకు ఓట్లేసి గెలిపించింది మ‌నుషుల‌ను చంప‌మ‌ని కాద‌న్నారు.

వేమ‌న‌ప‌ల్లి మండ‌లంలో గ‌తంలో సైతం దుర్గం శివ‌రాం అనే వ్య‌క్తిని సైతం సంతోష్ చంపేశార‌ని అన్నారు. ఇప్ప‌టికీ అదే దొర‌త‌నంతో అంద‌రినీ చంపేసే కార్య‌క్ర‌మం పెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక‌వేళ వారిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఎమ్మెల్యే ఇంటి ముంద‌ర ఆందోళ‌న చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికైనా నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like