కోర్టు మెట్లెక్కిన నిందితులు..
బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధూకర్ ఆత్మహత్య కేసులో నిందితులు కోర్టు మెట్లెక్కారు. తమపైన నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని వారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన కాంగ్రెస్ నేత రుద్రభట్ల సంతోష్ పేరుతో ఈ పిటిషన్ నమోదు అయ్యింది. వారం రోజులు అవుతున్నా నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదు. పైగా, వారు కోర్టుకు వెళ్లడంతో కేసు మరో మలుపు తిరిగినట్లయ్యింది.
వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్ (47) వారం రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్ రాసి ఉరివేసుకున్నాడు. ‘రుద్రభట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల రాజకీయంగా ఎదుర్కొనలేక నాపై తప్పుడు కేసులు పెట్టించి నా పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసి నా చావుకు కారణమయ్యారు. వీళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని రాసిన సూసైడ్ నోట్ మధుకర్ జేబులో లభించింది.
అటు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు నీల్వాయికి వచ్చి మధూకర్ కుటుంబాన్ని పరామర్శించారు. అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నీల్వాయి వచ్చారు. 48 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే బీజేపీ తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సైతం వచ్చి రామగుండం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా నిందితులు కోర్టుకు వెళ్లడంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.