అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీసు సంస్మరణ దినం
-అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
-పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు
-రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
Police Martyrs’ Remembrance Day on October 21st:పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం “పోలీస్ ఫ్లాగ్ డే” సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాలు ప్రజలకు తెలియజేస్తామన్నారు.
పోలీసులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేటగిరి-1 కింద కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు “Gender Discrimination at Work Place.”, కేటగిరి-2 కింద ఎస్.ఐ పై స్థాయి అధికారులకు *“Strengthening of ground level policing” వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. ఈ వ్యాసరచన పోటీలను తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో నిర్వహిస్తామన్నారు. 500 పదాలకు మించకుండా వ్యాసరచనలో పాల్గొని, ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానం, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుందన్నారు.
రక్తదాన శిబిరాలు, పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ, పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించనున్నట్లు చెప్పారు. ఇక షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు సైతం ఉంటాయన్నారు. తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 పోలీసులకు సంబంధించిన అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో ఆసక్తి గల యువతక ఔత్సహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని కమిషనర్ వెల్లడించారు.
ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభ తెలిపే విధంగా తీసిన (3) ఫోటోలు, తక్కువ నిడివి (3 నిమిషాలు) ఉన్న షార్ట్ ఫిలిమ్స్ తీసి పంపిస్తే వాటిని రాష్ట్రస్థాయి పోటీల కోసం పంపిస్తామన్నారు. ఈ షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదని, 10 x 8 సైజ్ ఫోటోలు, షార్ట్ ఫిలిం పెన్ డ్రైవ్ లో ఆ వ్యక్తుల పూర్తి వివరాలతో అందజేయాలని స్పష్టం చేశారు. కమిషనరేట్ స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలు, ఫొటోలను రాష్ట్ర స్థాయి పోటీల గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాదుకు పంపిస్తామన్నారు. ఫోటోలు, వీడియోలు ఈనెల 23వ తేదీ సాయంత్రంలోగా స్పెషల్ బ్రాంచ్ (NIB) కార్యాలయంలో అందించాలని ఆయన కోరారు.
ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి పోలీస్ కళా బృందంతో పాటల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు “పోలీస్ అమరవీరుల సంస్మరణ లో ఘనంగా నివాళులు అర్పిస్తూ “స్మృతి పరేడ్”, ” పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమాలు నిర్వహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ వెల్లడించారు.