నిందితుల అరెస్టు ఎప్పుడు సారూ..?

-ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసుల నిర్ల‌క్ష్యంపై ప్ర‌తిప‌క్షాల ఆగ్ర‌హం
-నిందితులు స్వేచ్ఛ‌గా తిరుగున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నిర‌స‌న‌
-ఎమ్మెల్యే వినోద్ ఫామ్‌హౌస్‌లోనే నిందితులు ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు
-ఎస్ఐకి బంధువులు కావ‌డంతోనే కేసు నీరుగారుస్తున్నార‌ని ఆగ్ర‌హం
  -ఉద్య‌మాన్ని మ‌రింత ఉధృతం చేస్తామ‌ని బీజేపీ హెచ్చ‌రిక‌

చైన్‌స్నాచింగ్ దొంగ‌ను గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప‌ట్టుకున్నాం… హ‌త్య చేసిన హంత‌కున్ని 24 గంట‌ల్లో అరెస్టు చేశాం… నిందితులు ఎంత‌టి వారైనా స‌రే వ‌దిలిపెట్టేది లేదు.. ఇవ‌న్నీ త‌ర‌చూ పోలీసులు చెప్పేవి.. మ‌నం వినేవి… మ‌రి కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ఒక‌రి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైతే ఎనిమిది రోజులైనా ప‌ట్టుకోక‌పోతే ఏమ‌నాలి…? ఇవ‌న్నీ ఖాకీల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌ల ప్ర‌శ్న‌లు…
————-
48 గంటలు టైమిస్తున్నా… ఏట మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల్సిందే.. వేధించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాల్సిందే… లేక‌పోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చ‌రిక‌….

బీజేపీ నాయ‌కుడు అధికార పార్టీ కాంగ్రెస్ నాయ‌కుల వేధింపుల వ‌ల్ల తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని లేఖ రాసి మ‌రీ చ‌నిపోయాడు. ఆ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు అరెస్టులు లేవు..? పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో క‌నీసం సాంకేతిక ఆధారాలు సంపాదించ‌లేక‌పోతున్నారా..? అధికార పార్టీ నేత‌లే క‌దా అని వ‌దిలేస్తున్నారా..? ఏకంగా కేంద్ర స‌హాయ మంత్రి హెచ్చ‌రిక‌లు సైతం ప‌ట్టించుకోవ‌డం లేదా..? ఇలా ఈ కేసులో ఎన్నో ప్ర‌శ్న‌లు.. అస‌లు మొద‌టి నుంచి ఖాకీలు అధికార పార్టీ నేత‌ల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకుంటున్నారు. ఈ కేసు అది నిజ‌మే అవుతోదంటూ ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

బీజేపీ వేమ‌న‌ప‌ల్లి మండ‌ల అధ్య‌క్షుడు ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసు విష‌యంలో నిందితుల‌ను ప‌ట్టుకోక‌పోవ‌డంతో ఖాకీల‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. పోలీసులు కావాల‌నే కేసును నీరుగారుస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. దాదాపు ఎనిమిది రోజులు అవుతున్నా నిందితుల్లో ఒక్క‌రు కూడా దొర‌క్క‌పోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిందితులు కాంగ్రెస్ నేత‌లు కావ‌డం, బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్ ఫాంహౌస్‌లో త‌ల‌దాచుకున్నార‌ని అందుకే పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదని దుయ్య‌బ‌డుతున్నారు. మ‌రోవైపు నిందితుల్లో ఒక‌రు ఎస్ఐకి బంధువు కావ‌డం వ‌ల్ల‌నే ఈ కేసు పూర్తి స్థాయి నీరుకారేలా వ్య‌వ‌హిస్తున్నార‌ని పోలీసులు ఇలాగే చేస్తే త‌మ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్‌ (47) వారం రోజుల కింద‌ట ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్‌ రాసి ఉరివేసుకున్నాడు. ‘రుద్రభట్ల సంతోష్‌, గాలి మధు, చింతకింది కమల రాజకీయంగా ఎదుర్కొనలేక నాపై తప్పుడు కేసులు పెట్టించి నా పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసి నా చావుకు కారణమయ్యారు. వీళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ మధుకర్‌ జేబులో లభించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద్ర‌రావు నీల్వాయికి వ‌చ్చి మ‌ధూక‌ర్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజ‌య్ 48 గంట‌ల్లో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేక‌పోతే ఉద్య‌మం చేస్తామ‌ని అధికారుల‌ను హెచ్చ‌రించారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు సైతం రామ‌గుండం క‌మిష‌న‌ర్‌కు వినతిప‌త్రం స‌మ‌ర్పించారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇక మ‌రోవైపు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య విలేక‌రుల స‌మావేశం పెట్టి మ‌రీ కాంగ్రెస్ నేత‌ల దాష్టీకం వ‌ల్ల‌నే ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ కేసు వ్య‌వ‌హారం అంతా బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోందంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆల‌స్యం అయితే ఈ కేసులో ఉన్న దోషులు త‌ప్పించుకునే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఈ కేసు మొత్తం నీరుగారే ప్ర‌మాదం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. నిందితుల‌కు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆశ్రయమిచ్చి వారిని కాపాడుతున్నారని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. ఎమ్మెల్యే ఫాంహౌస్‌లోనే ఉన్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌న్నారు. ఎమ్మెల్యే వినోద్ హైద‌రాబాద్లో ఉండ‌కుండా స్థానికంగా ఉండి ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూడాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

భారతీయ జన‌తా పార్టీ జిల్లావ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించింది. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌ల కేంద్రాలు, బెల్లంప‌ల్లిలో సైతం నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఎస్ఐని విధుల్లో నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేసింది. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు న‌గునూరి వెంక‌టేశ్వ‌ర్ గౌడ్ విలేక‌రుల సమావేశం పెట్టి మ‌రీ పోలీసుల పాత్ర‌పై మండిప‌డ్డారు. ఈ కేసులో ఎస్ఐ పాత్ర ఉంద‌ని తాము పిటిష‌న్‌ ఇస్తే.. ఎస్ఐ పేరు తీసేంత వ‌ర‌కు పోలీసులు పిటిష‌న్ తీసుకోలేద‌న్నారు. నిందితుల‌ను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ఏమిట‌ని ఆయ‌న మండిప‌డ్డారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. హైకోర్టుకు వెళ్లి మరీ పిటిషన్ వేశారని దుయ్య‌బ‌ట్టారు.

ఇప్ప‌టికే స‌మ‌యం మించిపోయింద‌ని నిందితుల‌ను ప‌ట్టుకోక‌పోతే ఆందోళ‌న ఉధృతం చేస్తామ‌ని బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. బీజేపీ నేత‌, రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్‌రావు స్థానిక లేక‌పోవ‌డంతో ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు న‌గునూరి వెంక‌టేశ్వ‌ర్ గౌడ్. ఆయ‌న వ‌చ్చాక ఆందోళ‌న తీవ్రం చేస్తామ‌న్నారు. ఈ కేసులో వేల్లు అన్ని కూడా పోలీసులవైపే చూపుతున్నాయి. నిందితుల‌ను అరెస్టు చేసి అంద‌రికీ స‌మ‌న్యాయం చేస్తామ‌ని నిరూపించుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు. లేక‌పోతే అధికార పార్టీ నేత‌ల‌కు ఒక న్యాయం, సామాన్యుల‌కు ఒక న్యాయం చేస్తార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకోవాల్సి వస్తుంది..

Get real time updates directly on you device, subscribe now.

You might also like