మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు
The biggest surrender in Maoist history:మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేశ్ సహా 208 మంది నక్సలైట్లు లొంగిపోయారు. బస్తర్ జిల్లాలోని జగ్దల్పూర్లో నిర్వహించిన నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమంలో వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటుగా నిలిచింది. లొంగిపోయిన తర్వాత మొత్తం 153 ఆయుధాలు అప్పగించారు. వాటిలో 19 ఏకే-47లు, పదిహేడు SLR, ఇరవైమూడు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు ముప్పై ఆరు 303-రైఫిళ్లు, 41 బోర్ గన్లు, పదకొండు బీజీఎల్ లాంఛర్లు, ఒక పిస్టల్ ఉన్నాయి.
రెండు రోజుల కిందట మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి 60 మంది అనుచర నక్సలైట్లతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలీలో సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట ప్రధాన స్రవంతిలో కలిసిపోయారు. ఈ నేపథ్యంలో తాము కూడా లొంగిపోతున్నట్లు ఆశన్న ప్రకటించారు. ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిపోయిన 208 మందిలో మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత సహా 100 మంది మావోయిస్టులు ఉన్నారు. ఇద్దరు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం అప్పటి హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్ యూ)కు నాయకత్వం వహిస్తూ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడి ఉంటుంది.