తల్లిదండ్రుల సాక్షిగా.. ఎలాంటి రాద్దాంతం జరగలేదు..
Minister Seethakka:`నన్ను కన్న సమ్మయ్య, సమ్మక్క సాక్షిగా చెబుతున్నా.. క్యాబినెట్లో ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. కేవలం ఎజెండా, ప్రజా సమస్యలపై మాత్రమే చర్చ జరిగింద`ని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావుపై మండిపడ్డ సీతక్క ఆయన వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోశారు. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆమె తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసి ఖండించారు. . అబద్ధాలు ప్రచారం చేసి హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారిపోయారు. ఆయన తన ఆరోపణలను నిరూపించగలరా…? అంటూ సీతక్క సవాలు విసిరారు.
అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అని ఘాటుగా విమర్శించిన సీతక్క, రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్సే అని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో రోడ్లపై అడ్వకేట్లను చంపిన ఘటనలను గుర్తు చేస్తూ, దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్సే అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తుంటే, కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె కవిత చేసిన ఆరోపణలపై కూడా హరీష్ రావు సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
అంతకు ముందు హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టుల్లో వాటాల కోసమే కాంగ్రెస్ నేతల మధ్య తగాదాలు ఏర్పడుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం ఒకరు అని వర్గాలుగా విడిపోయారు. ఇవాళ కేబినెట్ మీటింగ్ దండుపాళ్యం ముఠా లాగా అయిపోయిందని విమర్శించారు.
వ్యాపారవేత్తలకు తుపాకులు ఎక్కుపెట్టి బెదిరించి వసూలు చేస్తున్న సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. ఇది మేం చేస్తున్న ఆరోపణలు కాదు.. స్వయంగా ఒక మంత్రి కుమార్తె చెప్పిన వాస్తవం. హోం శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంటే నిస్పాక్షిక దర్యాప్తు ఎలా జరుగుతుంది..? మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి.. రాష్ట్రం పరువు బజారున పడేస్తున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటుంటే సీఎం చోద్యం చేస్తున్నారు. ముఠా పంచాయితీలు తెంపుకోవడానికి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరికి అందినకాడికి వారు దోచుకుంటున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.