ఓ వైపు తల్లి… మరోవైపు తనయుడు..
-బీసీ పోరాటంలో కవిత కుమారుడు ఆదిత్య
-తల్లితో కలిసి బంద్‌లో పాల్గొన్న ఆదిత్య
-42% రిజర్వేషన్ల సాధన కోసం రోడ్డుపై నిరసన
Kalvakuntla Kavitha and her son Aditya support Telangana bandh:42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ బంద్‌కు మద్దతుగా కవిత, ఆమె కుమారుడు ఆదిత్య మానవహారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని కవిత కోరారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పోరాటంలో తల్లి కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా రోడ్డెక్కారు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన ఆదిత్య.. బీసీల రిజర్వేషన్ల పోరాటానికి తన మద్దతును వినిపించారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే’ అంటూ ఫ్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం కేవలం తన తల్లి లేదా కొందరు నాయకులు మాత్రమే పోరాటం చేస్తే సరిపోదని.. ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అవసరమని బీసీల రాజకీయ సాధికారతకు ఇది తప్పనిసరి ఆదిత్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వటం విచారకరమన్నారు. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆమె కోరారు.