రేవంత్, బీజేపీ.. వేర్వేరు కాదు…
Balka Suman’s anger against Chief Minister Revanth Reddy:రేవంత్ రెడ్డి.. బీజేపీ వేర్వేరు కాదని… రేవంత్‌రెడ్డి జీన్స్‌లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ లు కలిసి ఉన్నాయని సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. అసలు బీజేపీతో కలిసిపోయి పనిచేసేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ వెల్లడించారు.
సదర్ ఉత్సవాలతో పాటు, అనేక వేదికల్లో బీజేపీ నేతలతో కలిసి రేవంత్ పాలుపంచుకుంటున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి జీన్స్ లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది… తనది ఆర్ ఎస్ ఎస్ స్కూల్ అని రేవంత్ స్వయంగా చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రేవంత్ ను కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ సీఎంగా భావిస్తుంటే, బీజేపీ నేతలు బీజేపీ సీఎంగా భావిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసే పని చేస్తున్నాయని ఎద్దేవా చేశారాయన. తన సొంత లోక్ సభ నియోజకవర్గం మహబూబ్ నగర్లో, తాను ఎంపీ గా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరిలో బీజేపీ ని గెలిపించింది రేవంత్ రెడ్డినేనని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ బీజేపీ సీఎంల కన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డికే అపాయింట్మెంట్లు ఇస్తున్నారని వెల్లడించారు. బీజేపీ ఎంపీలు సైతం రేవంత్ పై ఈగ వాలనీయడం లేదన్నారు. బడేభాయ్ చోటే భాయ్ లాగా రాష్ట్రం లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారని బాల్క సుమన్ తెలిపారు. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు… కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చినాక మంచిపై చెడు విజయం సాధిస్తున్నట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల్లో చీకట్లే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కేటీఆర్ పారిశ్రామిక వేత్తలకు గొడుగులు పట్టి మరీ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్శించారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు గన్ లు పెట్టి బెదిరిస్తున్నారని అన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదన్నారు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని, దళిత మంత్రిని పట్టుకొని సహచర మంత్రులు ఏ విధంగా మాట్లాడారో చూసామన్నారు. జూబ్లీహిల్స్ లో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేశారో లేదో చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జెల నగేష్, పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామమూర్తి, కురువ విజయ్ కుమార్, కట్ల స్వామి యాదవ్ పాల్గొన్నారు.