ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu:కేరళలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి (Sabarimala temple) వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం పంబ నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమలకు వెళ్లారు. ఇవాళ ఉదయం ఆమె హెలికాఫ్టర్‌లో పతనంతిట్ట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంపాకు వెళ్లారు. ఆమె గణపతి ఆలయంలో ఇరుముడిని సిద్ధం చేసుకుని, సన్నిధానం చేరుకున్నారు. రాష్ట్రపతి 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధిలో ఇరుముడి సమర్పించారు.
అందకుముందు ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ స్వల్ప ప్రమాదానికి గురైంది. పతనంతిట్ట సమీపంలో ఉన్న ప్రమదం వద్ద ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొత్తగా సిద్ధం చేసిన హెలిప్యాడ్‌పై సురక్షితంగా దిగింది. రాష్ట్రపతి దిగిన వెంటనే, ఆ హెలికాప్టర్ టైర్లు కొత్తగా వేసిన కాంక్రీట్ ఉపరితలంలోకి కొద్దిగా కుంగిపోయాయి. ఆ తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది హెలికాఫ్టర్‌ను బయటకు తీశారు.
ముర్ము ఓ రికార్డు నెలకొల్పారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతిగా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో రెండు గంటల పాటూ బస చేయనున్నారు. అక్కడే రాష్ట్రపతికి ప్రత్యేకంగా ఆహారం వండి వడ్డించనున్నారు. మధ్యాహ్నం 3:10 గంటలకు ముర్ము శబరిమల నుంచి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.