కాలం చెల్లింది.. ప్రాణాలు తీసింది..
Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ బస్సు (DD01N9490) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా దాని గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. బస్సు ఫిట్‌నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడీ (Fitness Validity) గడువు కూడా గత ఏడాది ముగిసింది. అయినా కాసులకు కక్కుర్తి పడిన ట్రావెల్స్ యాజమానులు కాలం చెల్లిన బస్సుతోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్ధమైంది. 19 మంది ప్రమాదం నుంచి బయటపడగా, మరో 11 మంది నిద్రలోనే కాలిబూడిదయ్యారు. పలువరు ప్రయాణికులు మిస్ అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. జైసూర్య (మియాపూర్), నవీన్‌కుమార్ (హయత్‌నగర్), కటారి అశోక్ (రంగారెడ్డి జిల్లా), పూనుపట్టి కీర్తి (హైదరాబాద్) ప్రమాదానికి గురైన బస్సులోనే ఉన్నారు. వీరంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.