ఇద్దరూ ఆడపిల్లలే అని.. కన్నబిడ్డతో సహా తల్లి ఆత్మహత్య..
తనకు పుట్టింది ఇద్దరూ ఆడపిల్లలే అనే మానసిక వేదనతో కన్న బిడ్డతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో చోటుచేసుకుంది…. జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన చెటుపల్లి శ్రవణ్, జగిత్యాల జిల్లా సారంగపూర్ కు చెందిన స్పందన (24)తో నాలుగేళ్ల కిందట వివాహం అయింది. వారికి ఇద్దరూ కూతుళ్లే పుట్టారు. చిన్న కూతురు పుట్టినప్పటి నుంచి ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో పలుమార్లు తాను చనిపోతానని కూడా చెబుతుండేది.
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో చిన్న కూతురు వేదశ్రీకి (9 నెలలు) అన్నం తినిపించుకుంటూ ఉంది. ఎవరూ లేని సమయం చూసి పాపతో సహా వ్యవసాయ బావి వద్దకు వెళ్లి దూకింది. గంట పాటుగా స్పందన కనిపించకపోయే సరికి పరిసరాలు వెదికారు. అనుమానంతో బావిలో చూడగా మృత దేహమై కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై అనూష సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి తల్లి భూదారపు ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.