ముంచుకొస్తున్న మరో తుఫాన్… ఇదే అతి బలమైంది…
Telugu States Rain Alert: అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు మంతా తుఫాన్ (The Manta storm) దూసుకువస్తోంది. దీంతో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అక్టోబర్ 26,27,28,29 తేదిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. కనీవినీ ఎరగని రీతిలో వర్షాలు పడే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాకాలంలో వచ్చిన అన్ని తుఫాన్‌ల కంటే ఈ తుఫాన్ బలమైందని స్పష్టం చేశారు.
సోమవారం నాటికి వాయుగుండంగా..
సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ ఎత్తులో విస్తరించిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం అల్పపీడనంగా మారుతుందని… తర్వాత 24 గంటల్లో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం వచ్చే సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. దీంతో సోమ, మంగళవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా,నంద్యాల,కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్..
తెలంగాణలో నాగర్ కర్నూల్,నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్,జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, జనగాం, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. మొత్తం 22 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అల్పపీడనాల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు కొద్ది రోజులు వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
లోతట్టు ప్రాంతాల అప్రమత్తం..
మొన్ననే వాయుగుండం ముప్పు తప్పిందంటే.. ఇపుడు మాత్రం మంతా తుపాను తీర ప్రాంతాలను కకావికలం చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను గండంతో ఏపీలోని ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు సహా ఇతర ఎమర్జన్సీ సర్వీసులు సెలవులను రద్దు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. 28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా తుఫాన్. విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు పడనున్నాయి. అటు తెలంగానలోని పలు జిల్లాలలో పాటు రాజధాని హైదరాబాద్ భారీ వర్షాలు కురవనున్నాయి.