క్షమించండి…
-అమరుల ఆశయాలు పూర్తిగా నెరవేర్చలేకపోయాం
-అమరుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
-కాంగ్రెస్ ఇవ్వకపోతే... వచ్చే ప్రభుత్వంతో తప్పక ఇప్పిస్తాం
-‘జాగృతి జనం బాట’కు బయల్దేరిన కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha:బీఆర్‌ఎస్ (BRS) పదేళ్ల పాలనలో అమరవీరుల ఆశయాలను పూర్తిగా నెరవేర్చడంలో… ఉద్యమకారులకు అనుకున్న స్థాయిలో న్యాయం చేయించడంలో గట్టిగా కొట్లాడలేకపోయిన… అందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి…. కల్వకుంట్ల కవిత..
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు కవిత బహిరంగ క్షమాపణలు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో వారికి పూర్తి న్యాయం చేయలేకపోయానని, కేవలం 500 కుటుంబాలకే ఉద్యోగాలు ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాగృతి జనం బాట’ పేరుతో రాష్ట్రంలో పర్యటించేందుకు కవిత శనివారం నిజామాబాద్ బయలుదేరారు. నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది అమరులయ్యారని తెలిపారు. వారి కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
తాను మంత్రిగా లేకపోయినా, ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని పార్టీ అంతర్గత వేదికల్లో పదే పదే అడిగానని కవిత స్పష్టం చేశారు. అయినా, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కొట్లాడలేకపోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెబుతున్నాననని కవిత ప్రకటించారు. అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నెరవేర్చకపోతే, వచ్చే ప్రభుత్వంతో తప్పక ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తాను ఈ పర్యటనకు బయలుదేరుతున్నానని కవిత స్పష్టం చేశారు. అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలనేదే లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలని.. అగ్రవర్ణాల్లోనూ అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదన్నారు. అన్ని వర్గాలు కలిసి ఉంటేనే తెలంగాణ బాగుంటుందని కవిత స్పష్టం చేశారు. గతంలో జాగృతిలో పనిచేసిన వారంతా మనస్పర్థలను పక్కనపెట్టి మళ్లీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ సాధన కోసం, జిల్లాల్లో ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో అక్కడికి వెళ్లి పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు.