పని స్థలాలలో సౌకర్యాలు కల్పించాలి
Singareni:బెల్లంపల్లి ఏరియా(Bellampalli Area)లోని సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు పనిచేస్తున్న చెక్ పోస్టుల వద్ద సరైన సౌకర్యాలు కల్పించాలని టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు(TBGKS Vice President Malraj Srinivasa Rao) డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ఎస్ఓ టు జీఎం రాజమల్లుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోలేటి సీహెచ్ పీ, కైరిగూడలో బొగ్గు రవాణా నియంత్రణకు సంబంధించిన చెక్‌పోస్టుల్లో కుర్చీలు సైతం సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కుర్చీలు సరి చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చెక్‌పోస్టుల్లో ఎండాకాలంలో ఎయిర్‌కండిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ చెక్ పోస్టులను ఆరు నెలలకు ఒకసారి కలర్, సున్నం వేయించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద లైటింగ్ సరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చెక్‌పోస్టుల దగ్గర పనిచేసే గార్డులకు అటవీ జంతువులు, క్రూర మృగాల బారి నుంచి రక్షణ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. చలికాలం వస్తున్నందున ఆరు బయట కాకుండా పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ జాయింట్ సెక్రెటరీ ఓరం కిరణ్ ఖైరిగూడ ఫిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్ పాల్గొన్నారు.