జాబ్ మేళాలతో 23,650 మందికి ఉద్యోగాలు

-విజయవంతంగా మెగా జాబ్ మేళా కార్యక్రమాలు
-ప్రభుత్వ చొరవకు యువత హర్షం
-ప్రభుత్వ సంకల్పం – సింగరేణి సౌజన్యంతో ఘనంగా ఏర్పాట్లు
-ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 7 పట్టణాల్లో భారీ జాబ్ మేళా కార్యక్రమాలు
-పాల్గొన్న 66,965 మంది నిరుద్యోగ యువత
-ఒక ఉత్సవంగా, ఉత్సాహంగా కొనసాగుతున్న జాబ్ మేళాలు

Singareni: ఉద్యోగం ప్రతీ నిరుద్యోగి స్వప్నం తగిన విద్యార్హతలు ఉన్నా, హైదరాబాద్ నగరంలో కంపెనీల చుట్టూ తిరిగినా ఉద్యోగం లభిస్తుందన్న హామీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువత ముంగిటకే హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి, వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(Singareni Collieries Company Limited) కల్పిస్తోంది. నిరుద్యోగుల ముఖాలపై వెలుగులు నింపుతూ, సింగరేణి గత ఆరు నెలలుగా మెగా ఉద్యోగ మేళాల రూపంలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది. దాదాపు 24 వేల మంది యువతకు కొలువులను కల్పించి వారిలో నూతన ఉత్సాహం నింపింది.

ప్రభుత్వ సంకల్పానికి సింగరేణి తోడ్పాటు..
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy Chief Minister Bhatti Vikramarka Mallu) ఆలోచనలతో సింగరేణి కంపెనీ సౌజన్యంతో ఆరు నెలల కాలంలో ఏడు పట్టణాలలో జాబ్ మేళాలు నిర్వ‌హించారు. ఇందులో 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, వీరిలో 23,650 మందికి ఉద్యోగాలు లభించడం విశేషం. ఇంత భారీ ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం ఇదే ప్రథమం. హైదరాబాద్ నుంచి 100 నుండి 250 వరకు పలు ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.

మ‌ధిర నుంచి బెల్లంప‌ల్లి దాకా..
ఈ జాబ్ మేళా కార్యక్రమాలను ఏప్రిల్ 21న మధిర నుంచి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సారథ్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 5,000 మంది పాల్గొనగా 2,300 మందికి ఉద్యోగాలు లభించాయి. 27న భూపాలపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో 3,500 మంది పాల్గొనగా 2,000 మందికి ఉద్యోగాలు లభించాయి. మే 18న గోదావరిఖనిలో నిర్వహించిన జాబ్ మేళాలో 5,100 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 3,029 మందికి ఉద్యోగాలు లభించాయి. మే 24న వైరాలో 12,000 మందికి పైగా పాల్గొనగా 4,041 మందికి ఉద్యోగాలు లభించాయి. అక్టోబర్ 25న హుజూర్ నగర్ లో నిర్వహించిన అతి పెద్ద జాబ్ మేళా కార్యక్రమంలో 20,500 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 4,574 మందికి ఉద్యోగాలు లభించాయి. 26న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మొత్తం 14,318 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా వీరిలో 4,611 మందికి ఉద్యోగాలు లభించాయి. అదే రోజు బెల్లంపల్లిలో జరిగిన మెగా జాబ్ మేళాలో 6,547 మందికి పైగా నిరుద్యోగ యువత ఈ కార్యక్రమానికి తరలివచ్చారు కాగా 3,095 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించాయి.

మ‌రిన్ని జాబ్‌మేళాల ఏర్పాటు…
సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ఈ భారీ మెగా జాబ్ మేళా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందించింది. స్టాల్స్ ఏర్పాటు, ప్రచారం, భోజనం, హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రైవేటు కంపెనీల ప్రతినిధులకు సౌకర్యాలు, మంచినీటి వసతి అన్ని సింగరేణి సంస్థ అందించింది. భవిష్యత్తులో కూడా సింగరేణి ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే సామాజిక బాధ్యత కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్(Singareni CMD N. Balaram) తెలిపారు. ప్రత్యేకంగా ఉద్యోగ మేళాలకు సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తామ‌న్నారు. దీని ద్వారా స్థానిక యువతకు, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి సింగరేణి  సహకారం అందిస్తుందన్నారు. త్వరలోనే కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, ఆసిఫాబాద్  ప్రాంతాల్లో మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like