అజారుద్దీన్ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

Azharuddin: కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి రాజ్‌భ‌వ‌న్‌లో ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. రేపు మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ప‌లువురు మంత్రులు హాజ‌రు కానున్నారు. అజారుద్దీన్‌ ప్ర‌మాణ‌ స్వీకారానికి హాజ‌రు కావాల‌ని మంత్రులతోపాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌కు జీఏడీ ఆహ్వాన లేఖ‌ల‌ను పంపింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి తొలి మంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కింది. ఏఐసీసీ (AICC) నుంచి అనుమతి లభించడంతో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్‌లో మైనార్టీ వర్గానికి ప్రాతినిథ్యం లేదు. ఈ కొరత తీర్చడం కోసం అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అజారుద్దీన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి మంత్రి కాబోతుండటం వలన.. నగరానికి కేబినెట్‌లో ప్రాతినిధ్యం దక్కినట్లవుతుంది. ప్రస్తుతం కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. వాటిలో ఒక దానిని భర్తీ చేస్తున్నారు.

రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌…
అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఈ నిర్ణయం.. జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో జరగడం.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా ఉండ‌టంతో ఈ నిర్ణయం ఉపఎన్నికపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున.. మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు.

ఆరు నెల‌ల్లోపు..
అయితే.. కేబినెట్ విస్తరణ అనేది రాజ్యాంగపరమైన విధి కిందికి వస్తుందని.. ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. అజారుద్దీన్ ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటా కింద మండలికి నామినేట్ అయ్యారు. అయితే.. ఆయన నామినేషన్ న్యాయపరమైన వివాదాల కారణంగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయినా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆరు నెలల్లోపు ఆయన సభ్యత్వం పొందవలసి ఉంటుంది.

ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ ఫిర్యాదు..
అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డిని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు లీగల్ సెల్ కలిసి ఫిర్యాదు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తుంది. కానీ, రెండేళ్లలో మైనార్టీలపై లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటూ బీజేపీ ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కావాలనే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముస్లిం నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి అప్పగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like