రూ. 2.50 లక్షలు ఎవరికి ముట్టినయ్…

మంచిర్యాల జిల్లలో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి సరుకులు పక్కదారి పట్టిన వ్యవహారంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు టీచర్లు కుమ్మక్కై అంగన్వాడీలో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి గుడ్లు, పాలు ఇతర సరుకులు అమ్మేందుకు ప్రయత్నించారు. వాటిని సీసీసీ పోలీసులు పట్టుకోవడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు టీచర్ల మీదకు రాకుండా నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా శ్రమించి విజయం సాధించారు. కేసు డ్రైవర్ తన మీద వేసుకోవడంతో ఆ కేసు పక్కదారి పట్టింది. అక్కడ డబ్బులు చేతులు మారినట్లు గుసగుసలు వినిపించాయి.
బలి పశువులు సూపర్వైజర్లు..
ఇక అసలు విషయానికి వస్తే ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముగ్గురు సూపర్వైజర్లపై వేటు పడింది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. సీడీపీవో నక్క మనోరమకు షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. అయితే అసలు వాళ్లను వదిలేసి కేవలం సూపర్వైజర్లనే బలి చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యత ఖచ్చితంగా సూపర్వైజర్లదే కానీ, కేవలం వారిపైనే చర్యలు తీసుకోవడం ఏంటనే దానిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాలకు కారణం ఇదీ…
పాలు, గుడ్లు పక్కదారి పట్టిన విషయంలో టీచర్లదే ప్రధాన పాత్ర. కానీ ఏదో మాయ చేసి దాని నుంచి వారు తప్పించుకున్నారు. ట్రాలీ డ్రైవర్ ది తప్పు అనుకున్నప్పుడు దానికి సూపర్వైజర్లు ఏం చేస్తారు..? ఒకవేళ సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా సూపర్వైజర్లతో పాటు టీచర్లను కూడా సస్పెండ్ చేయాలి.. కానీ వారిని వదిలేశారు. ఇక అసలు చెన్నూరు ప్రాజెక్టు అంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది. అక్కడ జరుగుతున్నంత అవినీతి ఎక్కడా జరగడం లేదు. ఇదంతా ఉన్నతాధికారులకు సైతం తెలుసు. మరి అలాంటప్పుడు సీడీపీవోను ఎందుకు సస్పెండ్ చేయలేదు. కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే జారీ చేసి ఎందుకు వదిలేశారనే సందేహాలు తలెత్తుతున్నాయి.
రూ. 2.50 లక్షలు చేతులు మారడమే కారణమా…?
ఈ వ్యవహారంలో కొందరు అధికారులకు డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. పాలు, కోడిగుడ్లు అమ్ముకున్న విషయానికి సంబంధించి ఐదుగురు టీచర్లు రూ. 2.50 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఒక ప్రజాప్రతినిధి భర్త, నాయకుడు దీనికి సూత్రధారిగా వ్యవహరించారు. అందుకే టీచర్లపై ఈగ వాలకుండా చూశారని సమాచారం. అటు టీచర్లు ఇటు సీడీపీవో తప్పించుకోగా చివరకు మిగిలింది మాత్రం సూపర్వైజర్లు అందుకే వారిపై వేటు వేశారు. వాస్తవానికి ఇందులో సీడీపీవోదే ప్రధాన పాత్ర. కానీ ఆమెపై ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు. అధికారులకు డబ్బులు ముట్టడంతో అసలు వాళ్లను వదిలేసి ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రంగంలోకి అంగన్వాడీ యూనియన్ నేతలు..
ఇదంతా ఒక్కెత్తు కాగా అంగన్వాడీ నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే టీచర్లను కాపాడేందుకు టీచర్ల ద్వారా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంకో యూనియన్‌కు చెందిన నేతలు అటు సూపర్వైజర్లు, ఇటు సీడీపీవోను కాపాడేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో మకాం వేసి ఆ సస్పెన్షన్ ఎత్తి వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సీడీపీవోను సైతం కాపాడేందుకు చూస్తున్నారు. ఇప్పటికే కమిషనరేట్‌లో తమకు పరిచయం ఉన్న నేతల ద్వారా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరి ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో తెలియనుంది.