బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ
Bellampally:బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి మొదలుకొని బెల్లంపల్లి కాంటా చౌరస్తా వరకు మూడు దశల్లో రోడ్డు విస్తరణ చేయనున్నారు. ఇప్పటికే నిర్మాణదారులకు పురపాలక శాఖ అధికారు లు నోటీసులు కూడా జారీ చేశారు. పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదించిన స్థలాల్లో నిర్మాణాలు పొంది ఉన్న యజమానులు స్వతహాగా తొలగించుకుంటున్నారు.
మూడు దశల్లో విస్తరణ పనులు…
బెల్లంపల్లిలో చేపట్టనున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను మూడు దశల్లో చేపట్టనున్నారు. టియుఎఫ్‌ఐడియుసి నుంచి రూ 9.7 కోట్ల నిధులతో ఈ విస్తరణ పనులను పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి పురపాలక శాఖ కార్యాలయం వరకు రూ. 2 కోట్లు, పురపాలక శాఖ కార్యాలయం నుంచి ఏఎంసీ చౌరస్తా వరకు రూ. 2 కోట్లు, ఏఎంసీ చౌరస్తా నుంచి కాంట అంబేద్కర్ చౌరస్తా వరకు రూ. 2.7 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కాంటా చౌరస్తా మరింత అభివృద్ధి చేయనున్నారు. ఆగస్టు 24న ఎమ్మెల్యే గడ్డం వినోద్ చౌరస్తా అభివృద్ధి పనులకు భూమి పూజ కూడా చేశారు.
పలు సంస్థలకు నోటీసులు జారీ
బెల్లంపల్లి పట్టణంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పురపాలక శాఖ అధికారులు ఇప్పటికే పలు సంస్థల నిర్వాహకులతో పాటు దేవాలయాలకు నోటీసులు అందించారు. అయ్యప్ప స్వామి దేవాలయం, చౌడేశ్వరి దేవాలయ కాంప్లెక్స్, బాలాజీ సినిమా ధియేటర్, సింగరేణి కళా వేదిక ఫంక్షన్ హాల్, సింగరేణి వర్క్ షాప్ లకు విస్తరణ చేపట్టే స్థలాల్లో నిర్మాణాలను కొంతమేర తొలగించాలని పురపాలక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చౌడేశ్వరి దేవాలయ కాంప్లెక్స్ నిర్వాహకులు కొంత మేరకు నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకున్నారు.