విద్యుత్ అధికారులకు ఫోరం షాక్
ఓ వినియోగదారుడికి సేవల్లో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులకు వినియోగదారుల ఫోరం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ డివిజన్లో ముస్తాఫ్ ఆలీ అనే వ్యక్తికి ఫంక్షన్ హాల్ ఉంది. తనకు ట్రాన్స్ ఫార్మర్ కావాలని డబ్బులు కట్టాడు. అయితే, ఆయన అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫంక్షన్ హాల్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ బిగించినా… దాని నుంచి స్థానికులకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఈయనకు మాత్రం కనెక్షన్ ఇవ్వలేదు.
దీంతో ఆయన నిజామాబాదులోని విద్యుత్ శాఖ వినియోగదారులఫోరాన్ని సంప్రదించాడు. రోజుల తరబడి తిప్పించుకున్న అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా అధికారులకు జరిమానా విధించారు. వినియోగదారునికి విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రూ. 7,000 రూపాయల జరిమాన విధిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, గడువులోగా ఉత్తర్వులు పాటించకపోతే రోజుకి 1000 రూపాయల అదనపు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.