పంట న‌ష్టానికి ప‌దివేలు… ఇల్లు మునిగితే ప‌దిహేను వేలు

CM Revanth Reviews Floods at Hanumakonda District :తుపాను ప్ర‌భావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు, ఇళ్లు మునిగిన వారికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పొలాల్లో ఇసుకమేటలు వేసిన ప్రాంతాల్లో ఎన్​ఆర్​ఈజీఎస్​ కింద పరిహారం చెల్లించాలన్నారు. మొంథా తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం హనుమకొండ కలెక్టరేట్​లో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రాణనష్టం, పశు సంపద, పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని సూచించారు.

తుపాను నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధికారులకు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు ముఖ్య‌మంత్రి. ప్రభుత్వ విధానం మారిందని అధికారులు గుర్తించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి రూపాయి రాబట్టుకుంటుందని, ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదలబోమని స్పష్టం చేశారు. తాత్కాలిక చర్యలపైనే కాకుండా శాశ్వత చర్యలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. వరంగల్​లో ఉన్న చెరువుల పరిధిలో ఆక్రమణలు ఉన్నాయా…? అని పరిశీలించాలన్నారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయంతో శాశ్వత చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు.

వరదల్లో చనిపోయిన వారి వివరాలు సేకరించాలని సీఎం రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. పశు సంపద నష్టపోయిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని అన్నారు. గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద పరిగణించాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులకు తెలిపారు. ప్రత్యేకంగా బడ్జెట్​ ఇచ్చి వరంగల్​ మీద దృష్టి పెడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కావాలో కూడా ఆలోచించాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like