మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య
Man brutally murdered under the pretext of mantras:మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) తిర్యాణి మండలంలో హనుమంతు రావు(50) అనే వ్యక్తిని దారుణ హత్య చేశారు. తిర్యాణి మండలంలోని మంగి ఏరియా పిట్టగూడ గ్రామానికి చెందిన రాయిసిడం వినోద్ ఉర్వేత హనుమంతురావుపై గొడ్డలితో దాడి చేశాడు. మెడపై వేటు పడటంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దాడిలో బొజ్జుబాయి స్వల్పగాయాలతో బయటపడింది. తనని చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ఆసుపత్రికి పంపించారు.
ఈ ఘటనపై తిర్యాణి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా తిర్యాణి సి ఐ ఎం. సంజయ్ (Tiryani C.I.M. Sanjay) మాట్లాడుతూ మంత్రవిద్య, మూఢనమ్మకాలు, దయ్యం మంత్రాలు వంటి వాటిని నమ్మవద్దన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి ఇతరుల ప్రాణాలను హరించడం లేదా హింస చేయడం తీవ్రమైన శిక్షార్హమైన నేరమని తెలిపారు. మూఢనమ్మకాలు, మంత్రవిద్య వంటి అంధవిశ్వాసాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.