మ‌న సివంగులు గెలిచారు..

Women’s world cup winner: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టింది. సౌతాఫ్రికాను చిత్తుచేస్తూ ఛాంపియన్ గా నిలిచింది. షఫాలీ వర్మ బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ టీమిండియాను విజేతగా నిలబెట్టింది.

మహిళల ప్రపంచ కప్ లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ముంబయిలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ సౌతాఫ్రికాను చిత్తచేసి భారత్ విజేతగా నిలిచింది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. స్మృతి మంధాన 45 పరుగులు, షఫాలీ వర్మ 87 పరుగులతో మొదటి వికెట్‌కు 104 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న క్రమంలో స్మృతి అవుట్ అయింది. ఆ తర్వాత కూడా షఫాలీ తన దూకుడు కొనసాగించింది. ఫోర్లు, సిక్సర్లతో సౌతాఫ్రికా బౌలింగ్ ను చెడుగుడు ఆడుకుంది. సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో ఖాకా బౌలింగ్‌లో క్యాచ్ రూపంలో అవుట్ కావడంతో ఆమె అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది.

అయితే ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత జెమీమా రోడ్రిగ్స్ 24 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే, మధ్యలో దీప్తి శర్మ 58 పరుగుల హాఫ్ సెంచరీ నాక్ తో అదరగొట్టారు. నిలకడగా ఆడి స్కోరు బోర్డు ముందుకు తీసుకెళ్లింది. ఆమెతో కలిసి కౌర్ నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఆ తర్వాత రిచా ఘోష్ చివరలో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో చివర్లో వేగంగా ఆడుతూ 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 కీలక వికెట్లు పడగొట్టింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరినా, భారత బ్యాటర్ల జోరును ఆపలేకపోయారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి, మహిళల ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.

299 పరుగుల భారీ ల‌క్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్ నిదానంగా ప్రారంభించింది. క్రీజులో కుదురుకున్న తర్వాత ఇద్దరు ఓపెనర్లు మంచి షాట్స్ తో స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. దూకుడు పెంచి ఆడుతున్న సమయంలో తాజ్మిన్ బ్రిట్స్ ను అమన్ జోత్ కౌర్ అద్భుతమైన త్రో తో రనౌట్ చేసింది. దీంతో సౌతాఫ్రికా 10 ఓవర్ లో 51 పరుగుల తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత శ్రీచరణి బోష్ ను తన తొలి ఓవర్ లోనే డక్ గా పెవిలియన్ కు పంపింది. ఈ మ్యాచ్ లో షఫాలీ వర్మ అద్భుతమైన ఆటతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ లో, ఆ తర్వాత బౌలింగ్ లో దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చారు. మొదట 87 పరుగుల కీలకమైన బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ వర్మ.. బౌలింగ్ సమయంలో కీలకమైన వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు షాకిచ్చింది. సూపర్ ఫామ్ లో ఉన్న సునే లూస్, మారిజాన్ కాప్ వికెట్లు తీసుకుంది. వీరిద్దరూ పెవిలియన్ కు చేరిన తర్వాత సౌతాఫ్రికా జట్టు వరుస గా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ 101 పరుగుల సెంచరీ నాక్ తో పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సౌతాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ అయింది.

దీప్తి శర్మ మరోసారి తన ప్రతిభను చూపించింది. బ్యాటింగ్ లో 58 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ను ఆడింది. ఇక బౌలింగ్ లో దుమ్మురేపింది. 5 వికెట్లతో సత్తా చాటింది. 42వ ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు తీసుకుంది. మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తీసుకువచ్చింది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా దీప్తి నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా భారత్ అవతరించింది. నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిస భారత్.. దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం ప్రొటీస్ టీమ్‌ను 246 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ ఫీట్ సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like