రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:20 మంది మృతి
Road Accident :రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 70మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు.. ఈ ప్రమాదంలో 20మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల – వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మూలమలుపు వద్ద బస్సుతోపాటు కంకర లోడుతో టిప్పర్ లారీ వేగంగా రావడంతో అదుపు తప్పి బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ క్రమంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. లారీలోని కంకర బస్సుపై పడడంతో బస్సులోని కొందరు ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఇప్పటి వరకు 20మృతదేహాలను వెలికి తీశారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారికి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.