ఎమ్మెల్యే కాలె యాదయ్యపై దాడికి యత్నం
Attempted attack on Congress MLA Kale Yadayaiah:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది మృత్యువాత పడ్డారు. రాంగ్ రూట్లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం వల్ల ఈ పెను విషాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్య(MLA Kale Yadayaiah)పై స్థానికులు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. కొన్నేళ్లుగా తాము రోడ్డు మరమ్మతులు చేయాలని, వెడల్పు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు స్థానికులు ఎమ్మెల్యేపై దాడికి కూడా ప్రయత్నించారు. అక్కడే ఉన్న కంకర రాళ్లను చేతిలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. పరిస్థితి గమనించిన పోలీసులు స్థానికులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించివేశారు. రోడ్డు భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆందోళన దృష్ట్యా ఆ ప్రాంతంలో మరింత మంది పోలీసులు మోహరించారు.