శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే..
TTD:తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీ.ఆర్. నాయుడు (Tirumala Tirupati Devasthanams Board Chairman B.R. Naidu) అన్నారు. బోర్డు చైర్మన్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామి దర్శనం రెండు గంటల్లో అయ్యేలా ప్రణాళికలు రూపొందిచామన్నారు. దీని కోసం ఏఐ సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
శ్రీవాణి ట్రస్టు కింద దళిత వాడల్లో వెంకన్న ఆలయాలను నిర్మించనున్నామని స్పష్టం చేశారు. ప్రాథమికంగా 5 వేలకు పైగా నిర్మించేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి గుడులు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. తిరుమల కొండ కింద సుమారు 50 ఎకరాల్లో 25వేల మంది భక్తులకు వసతి, మౌలిక సౌకర్యాలు కల్పించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల్లో నిత్యాన్నదానం చేయనున్నట్టు తెలిపారు. ఏడాది పాలనలో రూ.1,000 కోట్ల విరాళాలు వచ్చాయని చెప్పారు. ఒంటిమిట్ట ఆలయం వద్ద 100 గదులతో వసతి గృహం నిర్మాణంతో పాటు 108 అడుగుల జాంబవంతుని విగ్రహం ఏర్పాటుచేయనున్నట్టు వివరించారు.