మరో ప్రమాదం… బూడిదైన బస్సు
Bus Accident:వరుసగా బస్సు ప్రమాదాలతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు మంటల బారిన పడి పూర్తిగా దగ్ధమైంది.. సకాలంలో డ్రైవర్ అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులందరినీ హెచ్చరించారు. వారు సురక్షితంగా బయటపడటంలో సహకరించారు. దీంతో భారీ ప్రాణాపాయం తప్పింది.
పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం రొడ్డ వలస సమీపంలో ఈ ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున సుమారు 35 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఒడిశా ఆర్టీసీ బస్సు…. జయపుర వెళ్లాల్సి ఉంది. మార్గమధ్యలో రొడ్డవలస వద్ద ఘాట్ రోడ్డు ఎక్కుతున్నప్పుడు ఇంజిన్ ఒత్తిడికి గురైంది. తొలుత పొగ వెలువడింది. దీంతో డ్రైవర్ అలర్ట్ అయ్యారు. ప్రయాణికులను కిందికి దించారు. క్షణాల్లో అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాప్తి చెందాయి.
వారం రోజుల కిందట రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. చేవెళ్ల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తోన్న టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఖానాపూర్ గేట్- మీర్జాగూడ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. అంతకుముందు- కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి బస్సు మంటలబారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది సజీవదహనం అయ్యారు. రోడ్డుపై బైక్ ను ఢీకొట్టడంతో రాపిడి చెలరేగి మంటలు అంటుకున్నాయి. బస్సు మొత్తం దగ్ధమైంది.