జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
Jammu Kashmir Encounter:కుప్వారా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు. అక్రమంగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు మట్టుపెట్టాయి.
జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లాలో శనివారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని కీరన్ సెక్టర్‌లో ఉగ్రమూకలు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నాయన్న నిఘా సమాచారంతో భద్రతా దళాలు శుక్రవారం రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో శనివారం భద్రతాదళాలు తమ కంటపడగానే ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ప్రతిగా భద్రతాదళాలు కూడా కాల్పులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించాయి. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి
నెల రోజుల కిందట కూడా..
నెల రోజుల కిందట కూడా కుప్వారాలో ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు దీటుగా స్పందించి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమై వారిని అంతమొందించాయని అధికారులు తెలిపారు. భారత్, పాక్ మధ్య జమ్మూకశ్మీర్‌లో 740 కిలోమీటర్ల మేర నియంత్రణ రేఖ ఉన్న విషయం తెలిసిందే. బారాముల్లా, కుప్వారా, బందిపొరా జిల్లాలతో పాటు జమ్మూ జిల్లాలోని కొంత భాగంలో నియంత్రణ రేఖ ఉంది.
చాలాసార్లే చొరబాటు..
చొరబాటు ప్రయత్నానికి సంబంధించి ఏజెన్సీల నుండి వచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, 07 నవంబర్ 2025న, కుప్వారాలోనికేరన్సెక్టార్‌లో ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా దళాలు తెలిపాయి. ఎల్‌ఓసీలో సున్నితమైన ప్రాంతాల్లో ఒకటైన కేరన్ సెక్టార్లో ఇటీవల చాలా సార్లు చొరబాట్లు జరిగాయి. పర్వత మార్గాల గుండా ఉగ్రవాదులు దేశంలోకి రావడానికి ప్రయత్నించారు. ఈ వారం ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. కిష్త్వార్‌లో జరిగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ఒక ఆర్మీ జవాన్ గాయపడ్డాడని చెబుతున్నారు. కిష్త్వార్‌లోనిఛత్రు సబ్ డివిజన్‌లోని జనసాంద్రత కలిగిన కలాబన్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.