అందెశ్రీ పాడె మోసిన ముఖ్యమంత్రి
Andesri’s funeral:ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక అందెశ్రీ (Ande Sri) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఘట్కేసర్ చేరుకున్న సీఎం అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి అందెశ్రీ పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ ఎన్ఎఎఫ్సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగింది. అందెశ్రీ సతీమణి మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ముఖ్యమంత్రి అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్ర కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు. మంగళవారం ఉదయం అందెశ్రీ అంతిమయాత్ర లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు సాగింది. అందె శ్రీ అంత్యక్రియల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కేశవరావు, వి. హనుమంతరావు పాల్గొన్నారు.