సింగ‌రేణి స‌హ‌కారంతో సివిల్స్ కు 43 మంది

Rajiv Gandhi Civils Abhayahastam:తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ కు ఎంపికై రాష్ట్రానికి పేరు, త‌ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలవాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం(Rajiv Gandhi Civils Abhayahastam) పథకం రెండో ఏడాది మంచి ఫలితాలను సాధించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ప్రోత్సాహకాన్ని అందుకున్న మొత్తం 202 మందిలో, 43 మంది మెయిన్స్ పాసై ఫైనల్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఈ పథకంలో భాగంగా ప్రిలిమ్స్ లో పాసైన 202 మంది సివిల్స్ అభ్యర్థులకు మెయిన్స్ లో పాల్గొనడానికి ప్రోత్సాహకంగా సింగరేణి (Singareni) యాజమాన్యం సీఎస్ఆర్ నిధుల(CSR Funds) నుండి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహ‌కాన్ని అందించింది.

ఈ ప్రోత్సాహకంతో సివిల్ అభ్యర్థులు 43 మంది మెయిన్స్ పాసై ఫైనల్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. దీనిపై సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్(Singareni CMD N. Balaram) ప్రకటన చేస్తూ తెలంగాణ నుండి ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్స్ లో విజేతలుగా నిలవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభించింద‌న్నారు. ఈ పథకానికి సింగరేణి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సహకారం అందించిందన్నారు. ఒకేసారిగా 43 మంది ఫైనల్ ఇంటర్వ్యూకి ఎంపిక కావ‌డం ఎంతో సంతోష‌క‌రంగా ఉందన్నారు. దీనిలో కూడా వారంతా విజయం సాధించి, అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అంతకుముందు సంవత్సరం తాము 140 మంది ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ప్రోత్సాహ‌కాన్ని అందించామని అయితే వారిలో 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యార‌ని, వారికి మ‌రో ల‌క్ష చొప్పున ప్రోత్స‌హ‌కం అంద‌జేయ‌గా వారిలో ఏడుగురు విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈసారి ఎంపికైన 43 మందిలో రంగారెడ్డి జిల్లా నుంచి 12 మంది, వరంగల్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 4, హైదరాబాద్ 3, నల్గొండ 3, మెదక్ 2, జగిత్యాల 2, అదిలాబాద్ 2 ఇతర జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారని స్ప‌ష్టం చేశారు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం విజయవంతమైందని తాము భావిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప‌ ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క మల్లు(Deputy Chief Minister Bhatti Vikramarka Mallu) స్ప‌ష్టం చేశారు. పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన 43 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించిన‌ట్లు చెప్పారు. దీని వల్ల వారంతా కేవలం చదువుపైనే ధ్యాస ఉంచి మెయిన్స్ కు ఎంపికయ్యారని, ఫైనల్స్ లో కూడా విజేతలై రాష్ట్రానికి మంచి పేరు తేవాలని వారు తమ సందేశాలలో పేర్కొన్నారు. త్వ‌ర‌లో ఇంట‌ర్వూల‌కు ఎంపికైన వారికి మ‌రో లక్ష ప్రోత్స‌హ‌కం అందిస్తామ‌న్నారు. వారికి మాక్ ఇంట‌ర్వూలు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like