జూబ్లీహిల్స్ విజయం… ఇదే రహస్యం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)లో కాంగ్రెస్ పార్టీ(Congress party) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. వాస్తవానికి చాలా మంది బీఆర్ఎస్(BRS) గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందంటూ ప్రచారం చేశారు. చాలా సర్వేలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా చెప్పాయి. కానీ, చాలా అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. సన్నబియ్యం, ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు.. కాంగ్రెస్‌ని గెలిపించాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ముందుకు సాగారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ప్రచారం కూడా బాగా పనిచేసింది. బీఆర్ ఎస్ గెలిస్తే స్థానిక సమస్యలు పరిష్కారం కావని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, అధికార పార్టీ నేత కాబట్టి.. సమస్యలు పరిష్కరించగలరు, నిధులు తేగలరు…. అంటూ చేసిన ప్రచారం కూడా ప్రజల్లోకి బాగా వెళ్లింది.
ఈ ఎన్నికల్లో మస్లింల ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపు మళ్లాయన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం బరిలో దిగలేదు. కానీ కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చింది. ఇది కాస్తా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. అజహరుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వడంతో ముస్లింల వ్యతిరేకత కాంగ్రెస్‌పై లేకుండా చేసింది. ఇక సీమాంధ్రుల మద్దతు కూడా కాంగ్రెస్‌కే ఇచ్చినట్లు ఈ ఎన్నిక ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు… జూబ్లీహిల్స్‌లో సీమాంధ్రులు ఎక్కువే. వారిలో చాలా మందికి టీడీపీతో అనుబంధం ఉండేది. ఇప్పుడు వారంతా.. రేవంత్ రెడ్డితో అదే అనుబంధాన్ని కొనగిస్తున్నారు. అందువల్ల వారు.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు.
అదే సమయంలో, బీఆర్ఎస్ సైతం పలు తప్పిదాలు చేసి చేజేతులారా ఓటమి కొని తెచ్చుకుందని పలువురు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే.. బీఆర్ఎస్ గెలిచేందుకు మొదట్లో అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. ఎందుకంటే.. ఇది ఆ పార్టీ సిట్టింగ్ సీటు కావడం, మాగంటి గోపీనాథ్ భార్య అభ్యర్థిగా నిలబడటం, ప్రచారంలో ముందుగానే రంగంలోకి దిగడం.. ఇలాంటి అంశాలు బీఆర్ఎస్‌కి ప్లస్ లాగా కనిపించాయి. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మొదట్లో వెనక్కే ఉంది. కానీ, చివరి క్షణం వరకూ ఆ పార్టీ నేతలు ప్రచారంలో తల మునకలు అయ్యారు. బీఆర్ఎస్ చివరి 5 రోజులూ ప్రచారంలో జోష్ తగ్గింది. అది కూడా ఆ పార్టీకి మైనస్ అయ్యింది.