పశువులపై పెద్దపులి దాడి.. భయాందోళనలో జనం..
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో పెద్దపులి అలజడి సృష్టిస్తోంది. బుగ్గగూడెం శివారు ప్రాంతంతో పాటు దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గండి శివారులో వేర్వేరుగా పశువులపై దాడి చేసి హతమార్చింది. బుగ్గగూడెం, కర్షలగట్టం అటవీ ప్రాంతానికి సమీపంలోని రాళ్లవాగు పక్కన ఉన్న పత్తి చేనులోని బుగ్గగూడెం గ్రామానికి చెందిన పల్లె ఎల్లక్క ఆవుపై దాడి చేసి చంపింది. ఇక అక్కడి నుంచి దేవాపూర్ అటవీ ప్రాంతంలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీలో సైతం ఎగ్గండి శివారు అటవీ ప్రాంతంలో ఆవుపై దాడి చేసి చంపింది. ఈ ఆవు టేకం మోతీరాంకి చెందిందని అధికారులు తెలిపారు.
ఇక్కడ పెద్దపుల్లి సంచారంతో సమీప ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పశువులపై దాడిచేసిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.