సౌదీ బస్సు ప్రమాదం: రెండు కుటుంబాలు బలి
Saudi Arabia bus accidentసౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది మృత్యువాత పడిన ఘటన తెలిసిందే. ఈ భయంకరమైన ప్రమాదంలో రెండు కుటుంబాలు బలయ్యాయి. ఈ ఘటనలో ఒక కుటుంబం నుంచి ఎనిమిది మంది మరణించగా, మరో కుటుంబం నుంచి ఏడుగురు చనిపోయారు. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో.. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న మార్గంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 46 మంది యాత్రికులు ఉన్నారు. మరణించిన 42 మంది హైదరాబాద్‌కు చెందిన వారే కావడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఈ ఘటన నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డారు. మహ్మద్ అబ్దుల్ షోయబ్(24) ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నందున ప్రమాదం నుంచి బయటపడగలిగాడు. షోయబ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతనికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాద ఘటనలో షోయబ్ కుటుంబం మొత్తం మృత్యువాతపడ్డారు. షోయబ్ తండ్రి అబ్దుల్ కదీర్, తల్లి గౌసియాబేగం, షోయబ్ తాత మహ్మద్ మౌలానా, రహీమున్నీసా, రహమత్‌బీ, మహ్మద్‌మన్సూర్ చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన మహ్మద్ అలీ, షహనాద్ బేగం, మస్తాన్, జకియాబేగం, షోయబ్, పర్వీన్, మహ్మద్ సోయల్ ఉన్నారు.