క‌డుపులో క‌వ‌ల‌లు.. త‌ల్లి మృతి… త‌ట్టుకోలేక తండ్రి ఆత్మ‌హ‌త్య

ఎన్నో ఏండ్లుగా పిల్ల‌లు లేరు… కొద్ది రోజుల్లోనే క‌వ‌ల‌లు త‌మ న‌ట్టింటి అడుగుపెట్టి ఆనందం తెస్తార‌ని ఆ దంప‌తులు భావించారు. కానీ, విధి ఆ కుటుంబానికి మ‌ర‌ణ‌శాస‌నం రాసింది… కండ్లు తెర‌వ‌కుండానే క‌వ‌ల‌లు మ‌ర‌ణించారు… చికిత్స పొందుతూ భార్య సైతం చ‌నిపోయింది. ఈ వరుస విషాదాలను తట్టుకోలేని భర్త సైతం ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. న‌వ్వులు పూయాల్సిన ఆ ఇంట గుండె ప‌గిలే విషాదం చోటు చేసుకుంది.

కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ముత్యాల విజయ్‌ (40), శ్రావ్య దంపతులు శంషాబాద్ సమీపంలోని సామ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. విజయ్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఏడేళ్ల కింద‌ట పెండ్లి అయ్యింది. ఇన్నేండ్లైనా పిల్లలు కలగకపోవడంతో.. ఐవీఎఫ్ ద్వారా పిల్ల‌ల కోసం ప్ర‌య‌త్నించ‌గా, ఎట్ట‌కేల‌కు శ్రావ్య గ‌ర్భం దాల్చింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన శ్రావ్యకు ఆదివారం రాత్రి కడుపునొప్పి రావడంతో అత్తాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కడుపులో ఉన్న కవలలు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన విజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడి తల్లి.. శ్రావ్యకు మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్‌లోని మైత్రి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది.

కవలలు పోయారన్న వార్తతో కుంగిపోయిన విజయ్‌.. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో శంషాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం భార్య మృతదేహాన్ని తీసుకెళ్లడానికి సంతకం అవసరమని ఆస్పత్రి యాజమాన్యం కోరడంతో బంధువులు విజయ్‌కు ఫోన్ చేశారు. అతడు స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఈ వ‌రుస మ‌ర‌ణాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like