పోరాటం చేస్తం… అండంగ ఉంటం..

-బీఆర్ఎస్ హ‌యాంలో రాజులా బ‌తికిన రైతులు
-చరిత్రలో ఎప్పుడు లేని విధంగా క‌ర్ష‌కుల ద‌గా
-నిబంధ‌న‌ల పేరుతో నిలువునా ముంచుతున్నారు
-ప్రైవేట్ వాళ్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారు
-ఈ నెల 21న జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధం
-బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR:రైతు స‌మ‌స్య‌ల మీద కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పోరాటం చేస్తామ‌ని, రైతుల‌కు నిత్యం అండ‌గా ఉంటామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో రాజులా బ‌తికిన రైతులు నేను నిలువుగా ద‌గాకు గుర‌వుతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డు (Market yard in Adilabad)లో పత్తి, సోయా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప‌త్తి, సోయా రైతుల ప‌రిస్థితి దారుణంగా మారిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కిసాన్ కపాస్ యాప్ ద్వారా పంటలు కొంటామంటున్నారు. మరి కనీసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏమిటని…? ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో మొబైల్ నెట్‌వ‌ర్క్ కనెక్టివిటీ అన్నిచోట్ల ఉండదు. మరి ఇలాంటి సందర్భంలో రైతన్నల పరిస్థితి ఏమిటో చెప్పాల‌న్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో చ‌లి తీవ్రంగా ఉంద‌ని, మంచు కురుస్తోంద‌ని తేమ శాతం ఎక్కువ‌గా ఉంద‌ని కేవ‌లం 12 శాతం తేమ నిబంధ‌న‌తో రైతుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్నారు. గతంలో త‌మ‌ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి 20 నుంచి 22 శాతం తేమ ఉన్న పంటను కూడా కొనిపించామన్నారు. కానీ ఇప్పుడు కేవలం 12 శాతం తేమ ఉంటే కూడా కొనుగోలు చేయమ‌ని ప్ర‌భుత్వం చేతులు ఎత్తేసిందని దుయ్య‌బ‌ట్టారు. రైతులు పంటలు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకునే వారు లేరు కనీసం అడిగే వారు కూడా లేరన్నారు. కనీసం ఇప్పటిదాకా లక్ష క్వింటాళ్ల పంట కూడా కొనలేదు. ప్రైవేట్ వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కై రైతుల పంటను దోచుకుంటున్నది అని అనిపిస్తున్నదని కేటీఆర్ అన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటే ఎందుకు ఈ రోజు అదిలాబాద్ మార్కెట్ యార్డ్‌ని బంద్ పెట్టారని కేటీఆర్ ప్ర‌శ్నించారు. మార్కెట్ యార్డులో రైతన్నలను కలుస్తామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు కల్పించిందని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. రైతుల‌కు ద‌క్కాల్సిన కనీస మద్దతు ధర రూ. 8,100 కూడా ద‌క్క‌డం లేద‌ని.. కేవ‌లం ఐదారు వేలు కూడా దక్కడం లేద‌ని స్ప‌ష్టం చేశారు. పత్తి ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామ‌నే ఒక అర్థరహితమైన నిబంధన పెట్టారని అన్నారు. తెలంగాణ కేబినేట్‌లో 50 శాతానికి పైగా తెలంగాణ జిల్లాలో పండుతున్న పత్తి పంటపై కనీసం మాట్లాడలేదన్నారు.

రైతుల‌ సమస్యల పరిష్కారానికి పోరాటాలు మాత్రమే మార్గమ‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రకాల పోరాటాలను చేసేందుకు మా పార్టీ సంసిద్ధంగా ఉంద‌ని, పార్టీ రైతన్నలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెంటనే ప్రభుత్వం పంటల కొనుగోలు కోసం ఫింగర్ ప్రింట్ల‌ నిబంధన, కేవలం 12 శాతం తేమ ఉండాలన్న నిబంధన, ఎకరానికి ఏడు క్వింటాల మాత్రమే కొంటామన్న నిబంధన ఎత్తివేయాల‌ని డిమాండ్ చేశారు.

అధిక వర్షాల వలన నష్టపోయిన రైతుల‌కు కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారాయ‌న‌. నష్టపోయిన ప్రతి రైతన్నకు ఎకరానికి 20.000 చొప్పున కనీస నష్టపరిహారం చెల్లించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు. స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకువచ్చి రైతన్నలకు న్యాయం చేయాలన్నారు. వెంటనే ఇక్కడి కేంద్ర మంత్రులు, తెలంగాణ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా స్థానిక రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి. లేకుంటే వారి పైన రైతన్నల పోరాటం తప్పదు అని కేటీఆర్ హెచ్చ‌రించారు. ఈ నెల 21న జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధం కార్యక్రమానికి ఆదిలాబాద్ అన్న‌దాత‌లు భారీగా త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like