ఎంపీ పర్యటన అంటే.. ఎందుకంత చులకన..
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయన స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు… ఆయన అనుచరులు సైతం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఇంతకీ ఏం జరిగిందంటే… రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఆయన రామగుండంలో ఆసుపత్రి స్థలం పరిశీలనకు వచ్చారు. అయితే అధికారులు ఆయన పర్యటనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అక్కడ వెలుతురు సైతం సక్రమంగా లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో స్థల పరిశీలన చేయాల్సి వచ్చింది.
దీంతో అధికారుల తీరుపై ఎంపీ వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం తీరంటూ ఆయన మండిపడ్డారు. అదే సమయంలో అధికారులు ఎంపీని అవమానించడం సరికాదంటూ కార్యకర్తలు సైతం విరుచుకుపడ్డారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో పాటు, ఈఎస్ఐ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన కార్మికుల సౌకర్యార్థం ఆసుపత్రి తీసుకువస్తానని ఎంపీ స్పష్టం చేశారు.