మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట
Maoists:ఓ వైపు వరుస ఎన్ కౌంటర్లు… మరోవైపు అగ్రనేతల లొంగుబాట్లతో కకావికలం అవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. అగ్రనేతలు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి(Telangana DGP Shivdhar Reddy)వివరాలను వెల్లడించనున్నారు.
ఇటీవలే మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాలను వదిలేశారు. ఆయనే కాకుండా మల్లోజుల వేణుగోపాల్ కూడా మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయారు. వీరితో పాటు చాలా మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఆయుధాలను వీడిచి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. తాజాగా ఏపీలోని మారేడుమిల్లిలో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతగా పేరొందిన హిడ్మా ఎన్ కౌంటర్ అయ్యాడు. టెక్ శంకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఏకకాలంలో ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులు కూడా అరెస్ట్ కాగా… వీరిని రిమాండ్ కు తరలించారు. ఉత్తర భారతం నుంచి దక్షణ భారతం వరకు కూడా ఎక్కడా కూడా మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.
ముందే లొంగిపోయారా..?
హిడ్మా ఎన్‌కౌంటర్‌కు ముందే తెలంగాణ పోలీసుల అదుపులోకి మావోయిస్టు రాష్ట్ర నాయకులు ఆజాద్, నారాయణ, వారితో పాటు క్యాడర్ వచ్చారు. ఎవరైనా సీసీ మెంబర్ స్థాయి వాళ్లను లొంగుబాటుకు ఒప్పించి.. వారితో పాటు వీరిని కూడా మీడియా ముందు చూపించాలని ప్రభుత్వ పెద్దలు వీరి లొంగుబాటు ఆపినట్టు తెలిసింది. ఇప్పటికే తమకు టచ్‌లోకి వచ్చిన వారికి హైదరాబాద్ నగరంలోనే షెల్టర్ ఇప్పించారని సమాచారం. ఈ క్రమంలో సీసీ మెంబర్ రాజిరెడ్డి లొంగిపోయేందుకు వస్తుండటంతో.. దేవ్‌జీ, దామోదర్ కోసం ప్రయత్నాలు చేశారని తెలిసింది. వారు లొంగుబాటుకు సుముఖంగా లేరని తేలడంతో రాజిరెడ్డి, ఆజాద్, నారాయణ లొంగుబాటును ఒక సభగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
లొంగుబాటు సభకు సీఎం రేవంత్..
మావోయిస్టుల లొంగుబాటు సభను ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించాలని మొదట అనుకున్నారని తెలిసింది. అడవుల్లో కంటే.. హైదరాబాద్ నగరంలోనే వారి లొంగుబాటును చూపించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించడంతో ఇక్కడే ఆ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై.. ఆయుధాలతో లొంగిపోయిన వారికి రాజ్యాంగ ప్రతి ఇస్తారని తెలిసింది. వారిపై ఉన్న రివార్డును స్వయంగా బహూకరిస్తారని సమాచారం.