నకిలీ లేడీ కానిస్టేబుల్ కలకలం
Fake Lady Constable:హైదరాబాద్‌లో నకిలీ లేడీ కానిస్టేబుల్ వ్యవహారం కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లాకు చెందిన ఉమాభారతి (21) అనే యువతి, పోలీస్ ఉద్యోగం రాకపోయినా.. ఖాకీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించింది. ఉమాభారతి సచివాలయం, వీఐపీ మీటింగ్‌లతో పాటు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల బందోబస్తుల్లో కూడా పాల్గొంది. నవంబర్ 21న సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పోలీస్ మోజుతో చేసిన ఈ సాహసానికి మాదాపూర్ పోలీసులు యువతిని అరెస్ట్ చేసి.. కేసును జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.
షాపూర్ నగర్‌కు చెందిన ఈ యువతి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనుకున్నా… ఆమె పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో అసలు ఉద్యోగమే లేకున్నా.. ఖాకీ యూనిఫాం కొనుగోలు చేసి, తాను విధుల్లో ఉన్నట్లుగా పలువురిని నమ్మించింది. ఉమాభారతి కేవలం డ్రెస్ వేసుకోవడం వరకే పరిమితం కాలేదు. హైదరాబాద్ నగరంలో జరిగిన పలు కీలకమైన, సున్నితమైన కార్యక్రమాలలో ఆమె బందోబస్తు విధులు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. సచివాలయంలో జరిగిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల ఊరేగింపు వంటి ప్రధాన ఈవెంట్లలో ఆమె పోలీసు సిబ్బందితో కలిసి పనిచేసింది. సైబరాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సైతం ధైర్యంగా వెళ్లి, అక్కడి క్యాంటీన్‌లో గడిపి వచ్చిందనే విషయం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ నకిలీ కానిస్టేబుల్ కొన్ని కళాశాలల్లోకి వెళ్లి విద్యార్థులకు ‘సైబర్ నేరాలపై అవగాహన’ పేరుతో లెక్చర్లు కూడా ఇచ్చింది. ఏ అధికారికి లేదా సిబ్బందికి అనుమానం రాకుండా.. ఇన్ని చోట్ల వీఐపీ డ్యూటీలను ఎలా నిర్వహించిందన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 21న, ఉమాభారతి సైబరాబాద్ సీపీ ఆఫీస్ క్యాంటీన్‌లో అల్పాహారం చేస్తుండగా.. ఉన్నతాధికారులకు ఆమె ప్రవర్తన, యూనిఫాంపై అనుమానం వచ్చింది. వారు ఆమెను ప్రశ్నించగా, ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే యువతిని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు విచారణ నిమిత్తం కేసును జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.