డీసీపీగా బాధ్యతలు చేపట్టిన భూక్యా రామ్ రెడ్డి
Bhukya Ram Reddy takes charge as DCP:రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ కొత్త డీసీపీగా భూక్యా రామ్ రెడ్డి(Bhukya Ram Reddy) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. డీసీపీ పుల్ల కరుణాకర్ స్థానంలో సీఐడీ విభాగంలో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డిని పెద్దపల్లి డీసీపీగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల లోని గర్జనపల్లి కి చెందిన ఆయన 1989 బ్యాచ్ ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి అంచలంచలుగా ఎదిగి 2020 లో ఐపీఎస్ హోదా సాధించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీసీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతా పరిరక్షణ, మహిళా, శిశు రక్షణ వంటి అంశాలు ప్రాధన్యంగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. అదే విధంగా సైబర్ నేరాల నియంత్రణ, యువతలో నేర ప్రవృత్తుల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ పై దృష్టి సారిస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లలో సంప్రదించాలన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే తమ వద్దకు రావచ్చన్నారు. చట్ట వ్యతిరేక, సంఘ వ్యతిరేక పనులు చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలిపారు. ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఫోన్లో నేరుగా సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.