నువ్వో దగాకోరు.. ముక్కు నేలకు రాయి
ప్రభుత్వం, పేదల భూములు కబ్జా చేసిండు - ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపణ
హైదరాబాద్ : ఈటల రాజేందర్ పెద్ద దగాకోరు అని ఆయన ముక్కు నేలకు రాయాల్సిందేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈటల రేజేందర్ ప్రభుత్వ,ఎస్సి,ఎస్టీ భూములను కబ్జా చేసారని కలెక్టర్ చెప్పారని, అందులో తప్పేముందని సుమన్ నిలదీసారు. ఎస్సి,ఎస్టీల భూములను అడ్డగోలుగా కబ్జా చేశారని, నీతి నిజాయితీ ఉంది అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఎలా కబ్జా చేస్తారని ధ్వజమెత్తారు.
ముక్కు నేలకు రాయాలి..
పేదల భూముల ఆక్రమించానని రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని ఈటల రాజేందర్ గతంలో స్పష్టం చేసాడని, మరి కలెక్టర్ చెప్పిందని ప్రకారం భూములు ఆక్రమించినట్టు నిర్ధారణ అయ్యిందని, వెనకబడిన వర్గాలకు చెందిన భూములను కబ్జా చేసినందుకు తప్పైందని ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాయాలని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాలు చేసేది వీల్లే, నోరు లేని పేదల భూములను లాక్కునేది వీళ్లే అని మండిపడ్డారు. రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న అధికారులను నిందిస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ ప్రజలు ఇప్పటికైనా ఈటల తీరును గమనించాలని విజ్ఞప్తి చేసారు.
ఎవరి భూములు వారికి ఇవ్వాలి…
ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని బాల్క డిమాండ్ చేసారు. ఈటల రాజేందర్ పైన రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ నిజాయితీగా పని చేస్తున్నాడని, కానీ అతన్ని భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈటల ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యయ్యో కలెక్టర్ నిగ్గు తేల్చాలన్నారు. అధికారులు, కలెక్టర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.